

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, పునరుత్పాదక ఇంధన నిల్వ వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తుగా వర్గీకరించని బ్యాటరీ వ్యర్థాలు, లిథియం అయాన్ బ్యాటరీ బ్లాక్ మాస్ ఎగుమతులను తక్షణమే నిషేధించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. విలువైన బ్యాటరీ సంబంధిత ఖనిజాలు దేశంలోనే అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు, దేశీయ బ్యాటరీ రీసైక్లింగ్ పరిశ్రమను ప్రోత్సహించడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
సవరించిన ఎగుమతి విధానం ప్రకారం, సీసం, కాడ్మియం, పాదరసం లేని వర్గీకరించని బ్యాటరీ స్క్రాప్, లిథియం అయాన్ బ్యాటరీ బ్లాక్ మాస్‌ను సంబంధిత ఐటీసీ (హెచ్‌ఎస్) వర్గీకరణలోని 'ఫ్రీ' జాబితా నుంచి 'ప్రొహిబిటెడ్' జాబితాలోకి మార్చారు. గతంలో ప్రాథమిక సెల్స్, ప్రాథమిక బ్యాటరీలు, ఎలక్ట్రిక్ అక్యుములేటర్లు, వినియోగించిన బ్యాటరీల వ్యర్థాల ఎగుమతులకు నిబంధనల ప్రకారం అనుమతి ఉండేది. తాజా మార్పుతో నిర్దిష్ట రకాల వర్గీకరించని బ్యాటరీ వ్యర్థాలను విదేశాలకు ఎగుమతి చేయడం సాధ్యం కాదు. లిథియం అయాన్ బ్యాటరీల రీసైక్లింగ్ ద్వారా లిథియం, కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన ఖనిజాలను తిరిగి పొందవచ్చు. ఈ పదార్థాలు దేశీయ రీసైక్లింగ్ పరిశ్రమకు అందుబాటులో ఉండేలా చేయడం ద్వారా సర్క్యులర్ ఎకానమీని బలోపేతం చేయడంతో పాటు, గ్రీన్ ఎనర్జీ, బ్యాటరీ తయారీ రంగాల్లో భారత్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!