

కృత్రిమ మేధ (ఏఐ) వల్ల ఉద్యోగాలు తగ్గిపోతాయనే ఆందోళనలు అవసరం లేదని, గతంలో కంప్యూటర్ల రాకతోనూ ఇలాంటి భయాలు వ్యక్తమైనప్పటికీ ఆ తర్వాత ఆర్థిక వృద్ధితో పాటు భారీగా ఉద్యోగాలు సృష్టించబడ్డాయని కాగ్నిజెంట్ గ్లోబల్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్, కాగ్నిజెంట్ ఇండియా సీఎండీ రాజేశ్ వారియర్ అభిప్రాయపడ్డారు. ఏఐ కూడా భవిష్యత్తులో కొత్త తరహా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. భారత్‌కు ఏఐ సేవలకు అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగే సామర్థ్యం ఉందని చెప్పారు. ఇప్పటికే దేశంలో ప్రారంభస్థాయి ఉద్యోగాల్లో గణనీయమైన పనులను ఏఐ నిర్వహిస్తోందని, రానున్న కాలంలో ఉద్యోగాల స్వరూపం మారనుందని వివరించారు. నియామకాల సమయంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వేగంగా నేర్చుకునే సామర్థ్యం, సమస్యల పరిష్కారం, కమ్యూనికేషన్, సృజనాత్మకత, మార్పులకు అనుగుణంగా పనిచేసే నైపుణ్యాలకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తాయని తెలిపారు.
ఏఐ రంగంలో భారత్‌కు నిపుణుల సంఖ్య, ఇంజినీరింగ్ అనుభవం, టెక్నాలజీ సేవల పరిశ్రమ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), అంకుర సంస్థలు బలమైన అవకాశాలుగా ఉన్నాయని రాజేశ్ వారియర్ పేర్కొన్నారు. యువత ఏఐ పరిజ్ఞానంతో పాటు వ్యాపార అవగాహన, విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, సమస్యలను గుర్తించి పరిష్కరించే సామర్థ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. మరోవైపు కంపెనీలు ఏఐ ప్రయోగాలకే పరిమితం కాకుండా వ్యాపార వృద్ధి, ఉత్పాదకత, వినియోగదారుల అనుభవం, వ్యయ నియంత్రణ వంటి అంశాల్లో స్పష్టమైన ఫలితాలు సాధించేలా దాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఉద్యోగులకు నిరంతర నైపుణ్యాభివృద్ధి, రీస్కిల్లింగ్ కల్పించడంతో పాటు పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే ఏఐ మార్పులను భారత్ దీర్ఘకాలిక అవకాశాలుగా మలుచుకోగలదని ఆయన వివరించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!