

ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు కీలక అప్డేట్. అధిక విలువ కలిగిన రవాణా, ఇంధన లావాదేవీలపై 1 శాతం అదనపు రుసుము వసూలు చేయనున్నట్లు ఎస్బీఐ కార్డ్ ప్రకటించింది. ఈ నిబంధనలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఒక్కో రవాణా లావాదేవీ విలువ రూ.30 వేలకుపైగా ఉంటే, ఆ లావాదేవీ మొత్తంపై 1 శాతం ఫీజు వర్తిస్తుంది. ఉదాహరణకు, రవాణా కోసం రూ.35 వేలు చెల్లిస్తే రూ.350 అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సరకు రవాణా, టోల్ ఛార్జీలు, బ్రిడ్జి ఫీజులు, బస్సు సేవలు వంటి లావాదేవీలు ఈ కేటగిరీలోకి వస్తాయి.
ఇంధన లావాదేవీల విషయంలోనూ కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి. ఒక బిల్లింగ్ సైకిల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోళ్ల మొత్తం రూ.50 వేల పరిమితిని దాటితే, మొత్తం ఇంధన ఖర్చుపై 1 శాతం రుసుము వసూలు చేస్తారు. ఉదాహరణకు, ఒక బిల్లింగ్ సైకిల్లో ఇంధనంపై రూ.55 వేలు ఖర్చు చేస్తే రూ.550 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పులు అధికంగా ప్రయాణించే వారు, ట్యాక్సీ నిర్వహకులు, ఎక్కువ ఇంధనం వినియోగించే వారు, వ్యాపార అవసరాల కోసం వ్యక్తిగత క్రెడిట్ కార్డులను ఉపయోగించే వారిపై ఎక్కువ ప్రభావం చూపవచ్చు. సాధారణంగా తక్కువ మొత్తాల్లో లావాదేవీలు చేసే వినియోగదారులపై ప్రభావం పరిమితంగా ఉండే అవకాశం ఉంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!