

అమెరికాలోని చిన్నారులకు స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ భారీ బహుమతిని ప్రకటించారు. దేశంలోని అర్హులైన ప్రతి చిన్నారికి రెండు స్పేస్‌ఎక్స్ షేర్లు అందించనున్నట్లు వెల్లడించారు. ఇందులో ఒక షేరును కంపెనీ ఇవ్వనుండగా, మరో షేరును తాను వ్యక్తిగతంగా బహుమతిగా అందించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ప్రకటించారు. అంతకుముందు అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ట్రంప్ అకౌంట్స్’ పథకంలో క్రియాశీలంగా ఉన్న ప్రతి ఖాతాకు కొత్తగా జారీ చేసిన క్లాస్-ఏ కామన్ స్టాక్‌లో ఒక షేరును అందించాలని స్పేస్‌ఎక్స్ నిర్ణయించింది. నవంబర్ 25న కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించగా, తాను కూడా అదే సంఖ్యలో షేర్లను వ్యక్తిగతంగా అందిస్తానని మస్క్ తెలిపారు.
మస్క్ వ్యక్తిగతంగా ఇచ్చే షేర్ల పంపిణీ విధానంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తాజా రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఆయన షేర్లపై ఉన్న లాకప్ గడువు 2027 జూన్‌లో ముగిసిన తర్వాత వాటిని బదిలీ చేసే అవకాశం ఉంది. మరోవైపు, స్పేస్‌ఎక్స్ అధ్యక్షురాలు గ్విన్ షాట్‌వెల్, ఆమె భర్త కూడా అక్టోబర్ 30న రెండు మిలియన్లకు పైగా చిన్నారులకు షేర్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తొలుత 11 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, మధ్యస్థ కుటుంబ ఆదాయం 57 వేల డాలర్లు లేదా అంతకంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే పిల్లలను లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు. విదేశాల్లో పనిచేస్తున్న సైనికుల పిల్లలు, ఫోస్టర్ కేర్‌లో ఉన్న చిన్నారులు, అర్హత కలిగిన టెక్సాస్ కౌంటీల పిల్లలకు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పించనున్నారు. చిన్న వయస్సు నుంచే పొదుపు, పెట్టుబడులపై అవగాహన పెంచి, భవిష్యత్తులో వారిని ఇన్వెస్టర్లుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం లక్ష్యం. పేర్కొన్న షేరు ధర 127.44 డాలర్ల ప్రకారం, రెండు షేర్ల విలువ ఒక్కో చిన్నారికి సుమారు 254.88 డాలర్లు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!