

భారత ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పోర్టుఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులు మళ్లీ భారీగా వస్తున్నాయి. నవంబర్ నెల తొలి 15 రోజుల్లోనే విదేశీ మదుపర్లు దేశీయ ఈక్విటీల్లో రూ.84,290 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. గత కొన్ని నెలలుగా భారీగా నిధులను వెనక్కి తీసుకుంటున్న నేపథ్యంలో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం దేశీయ స్టాక్ మార్కెట్‌కు సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) స్టాక్స్‌లో విక్రయాల ఒత్తిడి, ముడిచమురు ధరలు తగ్గడం, పెద్ద కంపెనీల షేర్ల వాల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారడం వంటి అంశాలు విదేశీ మదుపర్లను భారత మార్కెట్ల వైపు ఆకర్షిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అక్టోబర్‌లో రూ.34,843 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.35,861 కోట్ల ఎఫ్‌పీఐ నిధులు భారత మార్కెట్ల నుంచి వెనక్కి వెళ్లాయి.
అంతర్జాతీయంగా చోటుచేసుకున్న అనుకూల పరిణామాలు విదేశీ పెట్టుబడుల రాకకు దోహదపడ్డాయి. నవంబర్ తొలి వారంలో ముడిచమురు ధరలు ఇటీవలి గరిష్ఠ స్థాయుల నుంచి సుమారు 13 శాతం తగ్గి బ్యారెల్‌కు దాదాపు 97 డాలర్లకు చేరినట్లు సమాచారం. చమురు ధరల తగ్గుదలతో పాటు ఏఐ స్టాక్స్‌లో విక్రయాల ఒత్తిడి, లార్జ్‌క్యాప్ కంపెనీల ఆకర్షణీయమైన వాల్యుయేషన్లు విదేశీ మదుపర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి. దీంతో నవంబర్ 2 నుంచి 13 మధ్య దేశీయ ఈక్విటీల్లోకి రూ.84,290 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ నిధుల ప్రవాహంతో ఈ ఏడాది ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్లకు పైగా ఉన్న విదేశీ సంస్థాగత మదుపర్ల నికర పెట్టుబడుల ఉపసంహరణలు సుమారు రూ.2.1 లక్షల కోట్లకు తగ్గినట్లు అంచనా. ఇదే సమయంలో నిఫ్టీ 25 వేల మార్కును దాటింది. ఇకపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, ముడిచమురు ధరలు, ఇరాన్–గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు, రూపాయి మారకపు విలువలో హెచ్చుతగ్గులు, ఆర్‌బీఐ వడ్డీ రేట్లపై అంచనాలు మార్కెట్ గమనాన్ని ప్రభావితం చేయనున్నాయని నిపుణులు భావిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!