

హైదరాబాద్‌లో తన వైద్య సేవల నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కొండాపూర్‌లో 300 పడకల సామర్థ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆజాద్ మూపెన్ వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కొత్త ఆస్పత్రి ప్రారంభంతో హైదరాబాద్‌లో ఆస్టర్ మొత్తం పడకల సామర్థ్యం 1,700కు చేరుకోనుంది. దీంతో నగరంలో సంస్థ వైద్య సేవల పరిధి మరింత విస్తరించనుంది.
ఈ విస్తరణ సంస్థ దేశవ్యాప్త అభివృద్ధి ప్రణాళికలో భాగమని ఆజాద్ మూపెన్ తెలిపారు. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా రూ.4,000 కోట్ల పెట్టుబడితో ప్రస్తుత ఆస్పత్రులను విస్తరించడంతో పాటు కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళిక ద్వారా అదనంగా 4,000 నుంచి 4,400 పడకలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ విస్తరణ పూర్తయితే దేశవ్యాప్తంగా ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ మొత్తం పడకల సామర్థ్యం 15,000కు చేరుకుంటుంది. హైదరాబాద్ తమకు కీలకమైన మార్కెట్ అని సంస్థ ఎండీ, గ్రూప్ సీఈఓ వరుణ్ ఖన్నా తెలిపారు. నగరంలో పెరుగుతున్న దీర్ఘకాలిక వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త ఆస్పత్రి ఏర్పాటుతో పాటు ఇప్పటికే ఉన్న ఆస్పత్రుల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నట్లు పేర్కొన్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!