

యూపీఐ లావాదేవీలపై విధించే మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)ను తగ్గించాలని ఐఐటీ బాంబే ప్రొఫెసర్లతో కూడిన బృందం తన నివేదికలో సూచించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రతిపాదించిన 0.40 శాతం ఎండీఆర్‌ను 0.08 శాతానికి పరిమితం చేయాలని పేర్కొంది. ప్రస్తుత విధానంలో ఎండీఆర్‌లో సుమారు 70 శాతం వాటా ఇష్యూయర్, అక్వైరర్ బ్యాంకులకు వెళ్తోందని, కరెంట్, సేవింగ్స్ ఖాతాల ద్వారా బ్యాంకులు పొందుతున్న లాభాలను పరిగణనలోకి తీసుకుని ఈ వాటాను తగ్గించాలని అభిప్రాయపడింది.
యూపీఐ వ్యవస్థ అభివృద్ధి కోసం బ్యాంకుల లాభాల్లో 3 శాతం నిధులు కేటాయించాలని నివేదిక సూచించింది. రూ.75 వేలకుపైగా జరిగే పర్సన్-టు-మర్చంట్ లావాదేవీలపై ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న గరిష్ఠ ఎండీఆర్ ఛార్జీ రూ.300కు బదులుగా రూ.40 మించకూడదని పేర్కొంది. ఈ మార్పులను రూ.50 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారులకు మాత్రమే వర్తింపజేయాలని సూచించింది. ఎండీఆర్ పంపిణీలో బ్యాంకులు, చెల్లింపుల సేవల సంస్థలు, థర్డ్ పార్టీ యాప్‌ల వాటాలను పునఃపరిశీలించాలని కూడా నివేదిక ప్రతిపాదించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!