

ప్రపంచంలోని రిటైల్, ఎఫ్ఎంసీజీ సంస్థల గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీలు)కు భారత్ ప్రధాన కేంద్రంగా మారుతోంది. టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం, గత ఏడాది చివరి నాటికి దేశంలో 180 రిటైల్ జీసీసీలు ఏర్పాటయ్యాయి. ఇది పోలెండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, జర్మనీ, ఈజిప్ట్ దేశాల్లోని మొత్తం రిటైల్ జీసీసీల కంటే 34 శాతం అధికం. వాల్‌మార్ట్ గ్లోబల్ టెక్, టార్గెట్, లోరియల్, ఏబీ ఇన్బెవ్, టెస్కో వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే భారత్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయి.
ఈ జీసీసీలతో ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరిగాయి. గత ఏడాది చివరి నాటికి వీటిలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 2,72,300కు చేరగా, ఒక్క ఏడాదిలోనే 52,000 మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరారు. 2024తో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య దాదాపు రెట్టింపైంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అనుకూల విధానాలు, పన్ను రాయితీలు, తక్కువ నిర్వహణ ఖర్చులు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.
జపాన్, దక్షిణ కొరియా సంస్థలు కూడా భారత్‌లో జీసీసీలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 180 కేంద్రాల్లో 130 నానో జీసీసీలు ఉండగా, ఇవి ప్రారంభంలో 200–250 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు మొదలుపెట్టి అవసరాన్ని బట్టి విస్తరిస్తున్నాయి. బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, పుణె, హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఇవి విస్తరిస్తున్నాయి. అయితే, అనుభవజ్ఞులైన ఏఐ నిపుణుల కొరత పరిశ్రమకు సవాలుగా మారిందని నివేదిక వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!