

న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నారు. స్లిప్‌లో కోహ్లీ డైవింగ్ క్యాచ్ అందుకోగా.. రోహిత్ శర్మ విసిరిన అద్భుతమైన త్రో ప్రత్యర్థి జట్టు ప్రమాదకర బ్యాటర్ వికెట్ పడటంలో కీలక పాత్ర పోషించింది. భారత ఆటగాళ్ల ఫీల్డింగ్‌ను ప్రశంసించిన జట్టు ఫీల్డింగ్ కోచ్ శుభదీప్ ఘోష్.. కోహ్లీ, రోహిత్ ప్రదర్శన వెనుక వారి అపార అనుభవం ఉందని తెలిపాడు. కవర్స్, పాయింట్ ప్రాంతాల్లో ఫీల్డింగ్ చేసే కోహ్లీ బంతి గమనాన్ని త్వరగా అంచనా వేస్తాడని, రోహిత్ త్రోల్లోనూ ఇదే అనుభవం కనిపిస్తుందని పేర్కొన్నాడు. న్యూజిలాండ్ మైదానాల్లో ఫీల్డర్లకు స్పందించేందుకు ఎక్కువ సమయం ఉండదని, అందుకే వేగంగా స్పందించడం, మజిల్ మెమొరీ ఎంతో ముఖ్యమని వివరించాడు.
మరోవైపు, 2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు రోహిత్ శర్మ ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే విరాట్ కోహ్లీ ఆ టోర్నీలో పాల్గొంటాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్, దిల్లీ కోచ్ విజయ్ దహియా ఆసక్తికర సూచన చేశాడు. కోహ్లీ టోర్నీలో ఆడకపోయినా కనీసం దిల్లీ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో యువ ఆటగాళ్లతో కొంత సమయం గడిపితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అతడి అనుభవం, సూచనలు యువ క్రికెటర్లకు ఎంతో విలువైనవని పేర్కొన్నాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!