

భారత స్థూల ఆర్థిక పునాదులు ఇప్పటికీ పటిష్ఠంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి స్పష్టం చేశారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువలో చోటుచేసుకుంటున్న తీవ్ర ఒడిదుడుకులకు అంతర్జాతీయ అనిశ్చితి ప్రధాన కారణమని తెలిపారు. డాలర్‌తో పాటు ఇతర ప్రధాన కరెన్సీలతో రూపాయి మారకం విలువను స్థిరీకరించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ చర్యల ఫలితంగా గత రెండు రోజుల్లో డాలర్‌తో రూపాయి విలువ ఒక శాతానికి పైగా పెరిగిందని పేర్కొన్నారు. అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకునేందుకు కూడా ఆర్బీఐ సిద్ధంగా ఉందన్నారు. బ్లూమ్‌బర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ 2027లో మాట్లాడిన ఆమె, డాలర్‌తో రూపాయికి స్థిరమైన మారకం రేటును నిర్ణయించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులను హేతుబద్ధీకరించడంపై జరుగుతున్న చర్చలను సీతారామన్ స్వాగతించారు. ఈ విషయంలో దేశీయ, విదేశీ మదుపరుల నుంచి తనకు విజ్ఞప్తులు అందుతున్నాయని తెలిపారు. అయితే వచ్చే ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చేయలేనన్నారు. మరోవైపు, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీటీ)ని రద్దు చేస్తేనే విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను (ఎఫ్‌పీఐ) ఆకర్షించగలమని ఎస్బీఐ రీసెర్చ్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!