

భారత్ విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయిలో దూసుకెళ్లాయి. సెప్టెంబర్ 4తో ముగిసిన వారానికి దేశ ఫారెక్స్ రిజర్వులు చారిత్రక గరిష్ఠ స్థాయి 785.706 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది. అంతకుముందు వారంతో పోలిస్తే నిల్వలు 44.903 బిలియన్ డాలర్లు పెరిగాయి. అంతకుముందు వారంలోనూ ఫారెక్స్ రిజర్వులు 11.475 బిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే. రిజర్వుల్లో కీలక భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 47.498 బిలియన్ డాలర్లు పెరిగి 648.168 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
దేశీయ కరెన్సీ రూపాయి విలువపై ఒత్తిడి, డాలర్‌కు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో విదేశీ మారకం మార్కెట్‌లో ఆర్బీఐ జోక్యం చేసుకుంటోంది. అధిక ఒడిదుడుకులను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలు ఫారెక్స్ నిల్వలపై ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత కొంతకాలం తగ్గుముఖం పట్టిన విదేశీ మారకం నిల్వలు తాజాగా మళ్లీ బలంగా పుంజుకున్నాయి. రికార్డు స్థాయికి చేరిన నిల్వలు దేశ బాహ్య ఆర్థిక స్థిరత్వానికి మరింత భరోసా కల్పించడంతోపాటు, భవిష్యత్తులో రూపాయి, విదేశీ మారకం మార్కెట్‌పై ఒత్తిళ్లను ఎదుర్కోవడంలో ఆర్బీఐకి వెసులుబాటు కల్పించనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!