

దేశీయ బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో కీలక సంస్కరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బ్రిటిష్ కాలం నాటి 1891 బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ చట్టం స్థానంలో బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు–2026కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు డిజిటల్ యుగానికి అనుగుణంగా బ్యాంకింగ్ లావాదేవీలు, న్యాయపరమైన సాక్ష్యాల వ్యవస్థను ఆధునీకరించే లక్ష్యంతో రూపొందించబడింది.
ఇప్పటి వరకు అమల్లో ఉన్న చట్టం కేవలం కాగితపు లెడ్జర్లు, క్యాష్ బుక్స్, చేతిరాత ఖాతాలకు మాత్రమే పరిమితమైంది. అయితే ప్రస్తుతం యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డిజిటల్ రికార్డులు, క్లౌడ్ స్టోరేజ్ ఆధారిత లావాదేవీలు విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్, డిజిటల్, వర్చువల్, క్లౌడ్ మరియు డిజాస్టర్ రికవరీ సర్వర్లలో భద్రపరిచిన రికార్డులను కోర్టుల్లో ప్రాథమిక సాక్ష్యాలుగా గుర్తించేలా కొత్త బిల్లు రూపొందించారు. అలాగే సమాచార సాంకేతిక చట్టం–2000 కింద ధ్రువీకరించిన డిజిటల్, ఎలక్ట్రానిక్ సంతకాలకు పూర్తి చట్టబద్ధత కల్పించారు.
కొత్త చట్టం బ్యాంకింగ్ సిబ్బందికి కూడా ఊరట కలిగించనుంది. ప్రత్యేక కారణాలు ఉన్నప్పుడే కోర్టు ఆదేశాలతో బ్యాంకు అధికారులను హాజరు కావాలని కోరే విధానం అమల్లోకి రానుంది. దీంతో బ్యాంకు ఉద్యోగులపై భారం తగ్గడమే కాకుండా సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, చెక్ బౌన్స్, రుణ రికవరీ కేసుల్లో ధ్రువీకరించిన డిజిటల్ సాక్ష్యాల ఆధారంగా విచారణలు మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!