

లగ్జరీ వాహనాల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ తొలిసారిగా భారత్‌లో ఏఎంజీ జీ 63 ‘ఆఫ్‌రోడ్ ప్రో’ ప్రత్యేక వాహనాన్ని ప్రవేశపెట్టింది. పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే ఈ ఎస్‌యూవీ ధర రూ.3.80 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. కఠినమైన భూభాగాల్లో ప్రయాణించేందుకు అనువుగా దీనిని రూపొందించారు. ప్రత్యేక సస్పెన్షన్ వ్యవస్థ, మెరుగైన వీల్ గ్రిప్, వాహన స్థిరత్వాన్ని పెంచే సాంకేతికతలు ఇందులో ఉన్నాయి. కొత్త ఆఫ్‌రోడ్ నియంత్రణ వ్యవస్థ ద్వారా క్లిష్టమైన మార్గాల్లో వాహనాన్ని సులభంగా నడపవచ్చు.
ఈ వాహనంలో 4.0 లీటర్ల సామర్థ్యం కలిగిన ఎనిమిది సిలిండర్ల బై-టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను 48 వోల్ట్‌ల స్వల్ప విద్యుత్ సహాయక వ్యవస్థతో అనుసంధానించారు. ఇది 585 హెచ్‌పీ శక్తిని, 850 ఎన్‌ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నాలుగు చక్రాలకు శక్తిని అందించే వ్యవస్థతో పాటు 20 అంగుళాల ప్రత్యేక చక్రాలు, పైకప్పుపై సామాను ఉంచే అమరిక, వెనుక మెట్లు ఉన్నాయి. 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ ఎస్‌యూవీ గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 4.4 సెకన్లలో అందుకుంటుంది. ఇంటీరియర్‌లో నప్పా లెదర్, ప్రీమియం మెటీరియల్స్, కస్టమైజ్ చేసుకునే యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి. ఆఫ్‌రోడ్ కాక్‌పిట్‌లో వాహనం స్థానం, దిక్సూచి, ఎత్తు, స్టీరింగ్ యాంగిల్, టైర్ ప్రెజర్, డిఫరెన్షియల్ లాక్ వంటి వివరాలను చూడవచ్చు. ఎంబీయూఎక్స్ ఎన్‌టీజీ7 ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థతో పాటు ఆగ్మెంటెడ్ రియాలిటీ నావిగేషన్ కూడా అందుబాటులో ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!