

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆరు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకుని గురువారం ఉదయం బ్యారెల్ ధర 1.5 శాతం పైగా పెరిగి 95 డాలర్లను దాటింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ క్రూడ్ ధర సుమారు 88 డాలర్ల వద్ద కొనసాగుతోంది. గత ఒక నెలలోనే బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 30 శాతం పెరగడం గమనార్హం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే చమురు ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ సముద్ర మార్గంలో నౌకల రవాణా మందగించింది. అలాగే ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియాకు చెందిన చమురు ట్యాంకర్లపై హూతీలు దాడులు చేయడంతో గ్లోబల్ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా గురువారం నష్టాల్లోనే కొనసాగాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు పడిపోయి 76,454 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 83 పాయింట్లు తగ్గి 23,913 వద్ద ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 5 పైసలు పెరిగి 96.48 వద్ద నిలిచింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!