

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (NSE) పబ్లిక్ ఇష్యూకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. దీంతో సుమారు రూ.30 వేల కోట్లను మార్కెట్ నుంచి సమీకరించేందుకు ఎన్‌ఎస్‌ఈకి మార్గం సుగమమైంది. జూన్‌లో సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించగా, ఈ నెల ఆమోదం లభించింది. సంబంధిత వర్గాల ప్రకారం ఈ నెల 18న ఐపీఓ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ధరల శ్రేణి, ఇతర వివరాలను ఈ నెల 15న వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కో-లొకేషన్ వివాదం కారణంగా ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ దాదాపు దశాబ్ద కాలంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సెబీ ఆమోదం లభించడంతో నిధుల సమీకరణకు ఎన్‌ఎస్‌ఈ సన్నాహాలు ప్రారంభించనుంది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో ఉండనుంది. ప్రస్తుత వాటాదారులు 14.89 కోట్ల షేర్లను, అంటే సుమారు 6 శాతం వాటాను విక్రయించనున్నారు. ఇందులో ఎస్‌బీఐ 2.48 కోట్ల షేర్లను విక్రయించనుంది. సుమారు రూ.5 లక్షల కోట్ల మార్కెట్ విలువతో రూ.30 వేల కోట్లను సమీకరించే అవకాశం ఉండగా, ఇది హ్యుందాయ్ ఇండియా రూ.27,870 కోట్ల రికార్డును అధిగమించే అవకాశం ఉంది. మరోవైపు, టెలికాం సంస్థ జియో కూడా సుమారు రూ.37 వేల కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!