

జెన్ జీ వల్లే సంప్రదాయ 9-5 ఉద్యోగ సంస్కృతి మారుతోందనే వాదనను జోహో సీఈఓ మణి వెంబు ఖండించారు. ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్ కొత్త కాన్సెప్ట్ కాదని, తమ సంస్థలో దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. ఉద్యోగులు ఎప్పుడు పని ప్రారంభించారు, ఎప్పుడు ముగించారు అనేది ముఖ్యమేమీ కాదని, వారికి అప్పగించిన పనిని సమయానికి పూర్తి చేశారా లేదా అనేదే అసలు ప్రమాణమని ఆయన స్పష్టం చేశారు.
ఈ అంశంపై జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కూడా స్పందించారు. వయస్సు ఆధారంగా తరాలను విభజించి అభిప్రాయాలు ఏర్పరచుకోవడం సరైన విధానం కాదన్నారు. బాధ్యత, ఆర్థిక క్రమశిక్షణ, కుటుంబ విలువలు వంటి లక్షణాలు ఏ ఒక్క తరానికీ పరిమితం కావని చెప్పారు. తమ సంస్థలో పనిచేస్తున్న 19 ఏళ్ల ఉద్యోగిని కుటుంబ అప్పులు తీర్చడానికే ప్రాధాన్యం ఇస్తోందని, మరో ఇద్దరు యువ ఉద్యోగులు ఆడంబరాలకు దూరంగా సాదాసీదా వివాహాలు చేసుకుని పొదుపును ఎంచుకున్నారని ఉదాహరణలు ఇచ్చారు. ఈ విలువలు కాలంతో సంబంధం లేకుండా ప్రతి తరంలోనూ కనిపిస్తాయని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!