

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అదనపు డైరెక్టర్ నల్లగుంట్ల యాదగిరిరావుకు చెందిన నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఉదయం ఏకకాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఏసీబీ రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆనంద్‌కుమార్ నేతృత్వంలోని బృందాలు ఈ తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ హైకోర్టు కాలనీలో ఉన్న యాదగిరిరావు నివాసంతోపాటు సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోని ఆయన బంధువులు, సన్నిహితులు, బినామీలుగా అనుమానిస్తున్న వారి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. బ్యాంకు లాకర్లను పరిశీలించి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ గుర్తించి స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ సుమారు రూ.4.75 కోట్లుగా లెక్కగట్టగా, వాటి బహిరంగ మార్కెట్ విలువ దాదాపు రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
యాదగిరిరావు 2007లో గ్రూప్-1 పరీక్ష రాసి గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్‌గా మున్సిపల్ శాఖలో చేరారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన, ఎక్కువకాలం జీహెచ్‌ఎంసీలో డిప్యూటీ, జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది. గత ఏడాది కాలంగా మెప్మాలో ఉన్నత హోదాలో పనిచేస్తున్నారు. మరోవైపు, మెప్మా నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గతంలో విచారణ చేపట్టగా, సుమారు రూ.40 కోట్ల నిధులు పక్కదారి పట్టినట్లు గుర్తించినట్లు సమాచారం. యాదగిరిరావును ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు. ఆస్తులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం విచారణ కొనసాగిస్తామని వెల్లడించారు.
ఏసీబీ గుర్తించిన ఆస్తుల వివరాలు:
హైదరాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో రూ.58.63 లక్షల విలువైన 12 ఓపెన్ ప్లాట్లు.
ఉప్పల్‌లో రూ.31.36 లక్షల విలువైన రెండు ఫ్లాట్లు.
ఉప్పల్ హైకోర్టు కాలనీలో 334 చదరపు గజాల స్థలంలో నిర్మించిన రూ.2 కోట్ల విలువైన జీ+3 భవనం, పెంట్‌హౌస్.
ఉప్పల్‌లో రూ.1.06 లక్షల విలువైన వాణిజ్య దుకాణం.
రూ.33.82 లక్షల విలువైన బంగారు ఆభరణాలు.
3 కిలోల వెండి వస్తువులు, వాటి విలువ రూ.1.8 లక్షలు.
సూర్యాపేట జిల్లాలో రూ.4.75 లక్షల విలువైన ఇల్లు.
రూ.73 లక్షల విలువైన టయోటా ఫార్చునర్, మరో కారు.
రూ.29.08 లక్షల విలువైన గృహోపకరణాలు.
రూ.7.01 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు.
బ్యాంకు ఖాతాల్లో రూ.32.30 లక్షల నిల్వలు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!