

హిందూ సంప్రదాయంలో రమా ఏకాదశికి విశేష ప్రాధాన్యత ఉంది. ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఈ పర్వదినాన్ని 2026లో నవంబర్ 5న ఆచరించనున్నారు. పంచాంగం ప్రకారం నవంబర్ 4న ఉదయం 11:03 గంటలకు ప్రారంభమయ్యే ఏకాదశి తిథి.. నవంబర్ 5న ఉదయం 10:35 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి సంప్రదాయాన్ని అనుసరించి నవంబర్ 5న భక్తులు వ్రతాన్ని ఆచరించనున్నారు. నవంబర్ 6న ఉదయం 6:37 నుంచి 8:48 గంటల మధ్య ఉపవాస విరమణ చేయవచ్చని పంచాంగ వివరాలు సూచిస్తున్నాయి. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి సుఖసంతోషాలు, ఐశ్వర్యం, కుటుంబ శ్రేయస్సు కలగాలని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తికి పసుపు పువ్వులు, పండ్లు, దీపం, అగరబత్తులు, తులసి ఆకులను సమర్పిస్తారు. అయితే ఏకాదశి రోజున తులసి ఆకులను కోయకూడదనే సంప్రదాయం ఉన్నందున పూజకు అవసరమైన ఆకులను ముందురోజే సిద్ధం చేసుకోవాలి.
రమా ఏకాదశి రోజున 'ఓం నమో భగవతే వాసుదేవాయ' మంత్రాన్ని జపించడంతో పాటు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం శుభప్రదంగా భావిస్తారు. విష్ణుమూర్తికి సంబంధించిన పురాణ కథలను చదవడం లేదా వినడం కూడా మంచిదని భక్తులు విశ్వసిస్తారు. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడంతో పాటు పండ్లు, నిత్యావసర వస్తువులను దానం చేయడం పుణ్యకార్యంగా భావిస్తారు. ఉపవాస నియమాలను పాటించేవారు అన్నం, మాంసం, చేపలు, గుడ్లు, ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలని సంప్రదాయాలు సూచిస్తున్నాయి. తులసి ఆకులను కోయడం, మాంసాహారం తీసుకోవడం వంటి పనులను నివారించాలి. శారీరక నియమాలతో పాటు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, చెడు ఆలోచనలకు దూరంగా ఉండటం, భక్తిశ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధించడం రమా ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన అంశాలుగా పరిగణిస్తారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!