

2027లో దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఫాస్ట్ పిచ్‌లకు పేరుగాంచిన దక్షిణాఫ్రికా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే.. న్యూజిలాండ్ పర్యటన భారత ఆటగాళ్లకు మంచి సన్నాహకంగా మారనుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. ఇప్పుడు వన్డేల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మధ్య ఓవర్లలో జట్టుకు అండగా నిలవాల్సి ఉంటుంది. ఆల్‌రౌండర్లు నితీశ్‌కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్ జట్టు సమతూకాన్ని పెంచనున్నారు. అయితే బౌలింగ్ విభాగం భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. మహ్మద్ సిరాజ్ నేతృత్వంలో అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ పేస్ బాధ్యతలు చేపట్టనుండగా.. మధ్య ఓవర్లలో అక్షర్ పటేల్, నమన్ ధీర్ కీలకం కానున్నారు.
మరోవైపు న్యూజిలాండ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్ఠంగా కనిపిస్తోంది. టీ20 సిరీస్‌లో రాణించిన టిమ్ సీఫర్ట్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైకేల్ బ్రాస్‌వెల్‌తో పాటు విల్ యంగ్, టామ్ లేథమ్ బ్యాటింగ్ బలాన్ని పెంచనున్నారు. స్పిన్‌లో మిచెల్ శాంట్నర్, పేస్‌లో మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, జాకబ్ డఫీ, నాథన్ స్మిత్ భారత్‌కు సవాలు విసరనున్నారు. హెన్రీ ఫిట్‌నెస్ సాధించకపోతే అతడి స్థానంలో బ్లెయిర్ టిక్నర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆక్లాండ్ పిచ్ బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా సహకరించే అవకాశముందని, పేసర్లకు మంచి ప్రాధాన్యం ఉంటుందని అంచనా. వర్షం ముప్పు లేదని సమాచారం. ఇదిలా ఉండగా, సాధన సమయంలో క్యాచ్ పట్టే ప్రయత్నంలో పేసర్ మ్యాట్ హెన్రీని ఢీకొన్న న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వేకు కంకషన్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అతడు తొలి వన్డేకు దూరమయ్యాడు. అతడి స్థానంలో టిమ్ సీఫర్ట్‌ను జట్టులోకి తీసుకున్నారు.
భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీశ్‌కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్: విల్ యంగ్, టిమ్ సీఫర్ట్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లేథమ్, మైకేల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంట్నర్, నాథన్ స్మిత్, కైల్ జేమీసన్, జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ/బ్లెయిర్ టిక్నర్.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!