

సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో ఓడరేవుల అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని పారిశ్రామికవేత్తలు స్వయంగా పరిశీలించాలని కోరారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను అనుభవించి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. పర్యాటక రంగంలోనూ ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరిన ఆయన.. ఈ సదస్సు ద్వారా రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నట్లు వివరించారు.
మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత, అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధతను జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు ప్రశంసించారు. సీఐఐ సదస్సులో మాట్లాడిన ఆయన.. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని సాధించే వరకు చంద్రబాబు పట్టువిడవకుండా కృషి చేస్తారని అన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని, హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిపై దృష్టి సారించారని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి అమరావతిలో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!