

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఆషాఢ బోనాల ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బంగారు బోనం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆలయాన్ని సందర్శించి బంగారు బోనం సమర్పించారు. అంబర్‌పేట మహంకాళి, చిలకలగూడ కట్ట మైసమ్మ, హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి, కార్వాన్ దర్బార్ మైసమ్మ, ఉప్పుగూడ మహంకాళి, మీరాలంమండి శ్రీమహంకాళి, బేగంబజార్ శ్రీభూలక్ష్మీమాత తదితర ఆలయాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి, బోరబండ పోచమ్మ తదితర ఆలయాలను కూడా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు దర్శించుకుని పూజలు చేశారు. ఎమ్మెల్సీ విజయశాంతి బోరబండలో అమ్మవారికి బోనం సమర్పించారు. ఎల్బీనగర్ ఖిల్లా మైసమ్మ ఆలయంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి అక్కన్న మాదన్న మహంకాళి, లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల సందర్భంగా నగరంలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!