

“మీది మొత్తం రూ.1000 అయింది.. రెండు లివర్స్ ఎక్స్‌ట్రా” అనే మాటతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుమారి ఆంటీ తన వ్యక్తిగత ప్రయాణం, హోటల్ వ్యాపారం, సంపాదన, నటనా జీవితం, బిగ్‌బాస్ అవకాశంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. హైదరాబాద్‌కు రాకముందు తాను బట్టలు కుట్టడంతో పాటు పొలం పనులు చేసేదానినని తెలిపారు. తన భర్తతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి 2011లో హోటల్ వ్యాపారం ప్రారంభించినట్లు చెప్పారు. తాను ఫేమస్ కాకముందే హోటల్‌కు మంచి గిరాకీ ఉండేదని, అయితే తన మాట వైరల్ అయిన తర్వాత మరింత మంది అక్కడికి రావడం మొదలుపెట్టారని వెల్లడించారు. యూట్యూబ్ ద్వారా కూడా తన హోటల్ గురించి ఎక్కువ మందికి తెలిసిందన్నారు. తాను పాపులర్ కాకముందు నుంచే సెలబ్రిటీలు హోటల్‌కు వచ్చేవారని, తమ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరిగినప్పుడు చిత్ర బృందాలు తమ దగ్గర నుంచి ఆహారం తీసుకెళ్లేవని చెప్పారు.
ప్రస్తుతం హోటల్‌కు రోజుకు సుమారు వెయ్యి మంది వరకు వస్తున్నారని, రోజువారీ కౌంటర్ అమ్మకాలు దాదాపు రూ.20 వేల వరకు ఉంటాయని కుమారి ఆంటీ తెలిపారు. అయితే ఆదాయానికి అనుగుణంగానే ఖర్చులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఏడు సినిమాల్లో నటిస్తున్నానని, వాటిలో చిన్న పాత్రలే చేస్తున్నానని చెప్పారు. గతేడాది బిగ్‌బాస్ కార్యక్రమం నుంచి తనకు ఫోన్ వచ్చినప్పటికీ అప్పట్లో వెళ్లలేదని వెల్లడించారు. మరోసారి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా పాల్గొంటానని కుమారి ఆంటీ తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!