

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోని జీరాం ఘాటీలో 2013లో జరిగిన మావోయిస్టుల దాడి కేసులో జగదల్‌పూర్ ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ దాడిలో 29 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు మృతిచెందారు. ఈ ఘటన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. సుమారు 13 ఏళ్ల పాటు సాగిన విచారణ అనంతరం కోర్టు 10 మంది నిందితులను దోషులుగా నిర్ధారించింది.
దోషులుగా నిర్ధారించిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. అయితే కోర్టు ఇంకా శిక్షను ప్రకటించలేదు. దోషులకు విధించే శిక్ష వివరాలను సెప్టెంబర్ 16న ప్రకటించనున్నట్లు కోర్టు వెల్లడించింది. ఈ కేసులో విచారణ సందర్భంగా 101 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి. జీరాం ఘాటి ఘటన ఛత్తీస్‌గఢ్ రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకరమైన మావోయిస్టు దాడుల్లో ఒకటిగా నిలిచింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!