

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తితిదే సీవీఎస్‌వో మురళీకృష్ణ తెలిపారు. తిరుమల నాలుగు మాడ వీధులతోపాటు ఇతర ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తితిదే విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో భద్రత, క్యూలైన్లు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను పటిష్ఠం చేస్తున్నట్లు చెప్పారు.
ధ్వజారోహణం రోజున సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు, బ్యారికేడింగ్ చేపట్టనున్నారు. గరుడసేవ సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో తిరుమల, తిరుపతిలో ప్రత్యేక పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ ప్రణాళికలను అమలు చేయనున్నారు. భక్తులకు మార్గనిర్దేశం చేసేందుకు ముఖ్య కూడళ్లలో వివిధ భాషల్లో సైన్‌బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. పోలీస్, తితిదే విజిలెన్స్‌తో పాటు ఫైర్, ఫారెస్ట్, ఇంటెలిజెన్స్, ఆర్టీసీ, రైల్వే శాఖల సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!