

ఖైరతాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరుకాగా, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్తో పాటు పెద్ద సంఖ్యలో మహిళా సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు మంత్రి సీతక్కకు ఆప్యాయంగా బొట్టు పెట్టి, బట్టలు అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే గాంధీభవన్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లోనూ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్న సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నామని ఆమె తెలిపారు. బతుకమ్మ వేడుకల ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.
బతుకమ్మ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని మంత్రి సీతక్క అన్నారు. అడుక్కునే స్థాయి నుంచి శాసించే స్థాయికి మహిళలు ఎదగాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని తెలిపారు. పూర్వీకులు అందించిన సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చెరువులకు, ప్రకృతికి పూలతో పూజలు చేసే బతుకమ్మ పండుగ మహిళల మధ్య ఆత్మీయతను పెంపొందిస్తుందని వివరించారు. దేశవిదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ మహిళలు సైతం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆస్తులు, పదవులు వస్తూ పోతూ ఉంటాయని, కానీ సంస్కృతి, సంప్రదాయాలు కోల్పోతే తిరిగి పొందడం కష్టమని పేర్కొన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తోందని వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!