

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనకు సంబంధించిన రహస్య భద్రతా వివరాలను ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారన్న ఆరోపణలపై తెలుగు స్క్రైబ్ ఖాతా నిర్వాహకులపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. సీఎం ప్రధాన భద్రతాధికారి (సీఎస్‌వో) కేబీ ఫ్రాంక్లిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే ఫిర్యాదుపై జులై 14న ఖైరతాబాద్ ఠాణాలో కేసు నమోదవగా, నగర అదనపు కమిషనర్ (క్రైమ్స్) ఆదేశాలతో సైబర్‌క్రైమ్‌కు బదిలీ చేసి రీరిజిస్టర్ చేశారు.
ఫిర్యాదు వివరాల ప్రకారం.. సీఎం జడ్ ప్లస్ భద్రతకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని తెలుగు స్క్రైబ్ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసినట్లు గుర్తించారు. జూన్ 13న సీఎం దిల్లీ పర్యటన, నిమిషాల వారీ షెడ్యూల్, బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి దిల్లీ పోలీసు జాయింట్ కమిషనర్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్, ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు, డీజీపీతో పాటు పలువురు అధికారులకు వైర్‌లెస్ సందేశం పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ వివరాలు సీఎం పర్యటన కొనసాగుతుండగానే సోషల్ మీడియాలో వెలువడినట్లు ఆరోపించారు. వైర్‌లెస్ సందేశాన్ని బహిరంగంగా ప్రచురించేందుకు అనుమతి లేదని, అధికారుల్లో ఎవరైనా ఈ సమాచారాన్ని అక్రమంగా సోషల్ మీడియా ఖాతాకు చేరవేసి ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!