

బాలీవుడ్ నటి కరీనా కపూర్ తన విద్యాభ్యాసం, సినీ కెరీర్, పాత్రల ఎంపికపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చదువును పూర్తి చేయకుండా నటనను కెరీర్‌గా ఎంచుకున్నందుకు ఇప్పటికీ పశ్చాత్తాపం ఉందని తెలిపారు. రెండు దశాబ్దాలకు పైగా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె ప్రస్తుతం వెండితెరతో పాటు ఓటీటీలోనూ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నారు. కరీనా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘దాయారా’ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 18న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో కరీనా పోలీసు అధికారిణి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. 11వ తరగతి తర్వాత చదువును కొనసాగించకుండా నటన వైపు వచ్చినట్లు చెప్పారు. నటిగా తనను తాను నిరూపించుకోవాలనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తన అనుభవం కారణంగానే పిల్లలు ముందుగా చదువు పూర్తి చేసి, ఆ తర్వాత తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవాలని ప్రోత్సహిస్తున్నానని చెప్పారు. బాలికల విద్యకు మద్దతు ఇవ్వడానికి యూనిసెఫ్ తనను సంప్రదించినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యానని, చదువు పూర్తి చేయలేదనే బాధ ఇప్పటికీ తనలో ఉందని వెల్లడించారు.
సినిమాలను వాటి బాక్సాఫీస్ విజయావకాశాల ఆధారంగా ప్రచారం చేయడం తనకు విసుగు కలిగిస్తుందని కరీనా అన్నారు. అలాగే తన వయసు ఆధారంగా పాత్రలు నిర్ణయించబడటం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. 75 ఏళ్ల వయసులోనూ నటిస్తూ విభిన్న పాత్రలు పోషించాలని ఉందని తెలిపారు. సినిమాల ఎంపికలో బలమైన కథలు, ప్రతిభావంతులైన దర్శకులను ఎంచుకోవడమే తనకు ముఖ్యమని చెప్పారు. తనలోని కొత్త కోణాలను ఆవిష్కరించేలా, తనను సవాలు చేసే కథల్లో నటించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రేక్షకులు తనను ఎక్కువగా హాస్యభరితమైన, తేలికపాటి వినోదాత్మక చిత్రాల్లో చూడాలని కోరుకుంటారని తెలిసినా, ఒకే తరహా పాత్రలకు పరిమితం కావడం తనకు ఇష్టం లేదన్నారు. ఒక నటిగా ఎప్పుడూ విభిన్నమైన పాత్రలను అన్వేషిస్తూ ముందుకు సాగాలని, అందుకే పాత్రల ఎంపికలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నానని కరీనా తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!