

విమానాల్లో ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణ, సిబ్బంది మర్యాదపూర్వక ప్రవర్తన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర ప్రశ్నించారు. దీనికి సమాధానంగా పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ మాట్లాడుతూ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆధ్వర్యంలో ప్రయాణికులు, విమానాలు, విమానాశ్రయ ఆస్తుల భద్రతతో పాటు విమానాల్లో క్రమశిక్షణను కాపాడేందుకు స్పష్టమైన నిబంధనలు అమలులో ఉన్నాయని తెలిపారు.
అల్లరి లేదా అవాంఛనీయంగా ప్రవర్తించే ప్రయాణికులను నియంత్రించేందుకు "హ్యాండ్లింగ్ ఆఫ్ అన్రూలీ అండ్ డిస్రప్టివ్ ప్యాసింజర్స్" పేరుతో ప్రత్యేక మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయని మంత్రి వివరించారు. ప్రత్యేక అవసరాలున్న ప్రయాణికుల కోసం ప్రత్యేక క్యాబిన్ భద్రతా నిబంధనలు కూడా అమలులో ఉన్నాయని తెలిపారు. ప్రయాణికుల ఫిర్యాదుల వేగవంతమైన పరిష్కారం కోసం 24 గంటల ప్యాసింజర్ అసిస్టెన్స్ కంట్రోల్ రూమ్, ఎయిర్ సేవా పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా డీజీసీఏ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, విమానయాన సంస్థలతో సమన్వయం చేస్తూ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!