

ప్రాంతీయ రైల్వే కనెక్టివిటీని బలోపేతం చేయడంతో పాటు ప్రయాణికులు, సరుకు రవాణాను మరింత వేగవంతం చేసే దిశగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ముకుట్‌బన్, గడ్చాందూర్ మధ్య 38.21 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రూ.493 కోట్లను మంజూరు చేసింది. యవత్మాల్ జిల్లాలోని ముకుట్‌బన్, చంద్రాపూర్ జిల్లాలోని గడ్చాందూర్ ప్రాంతాలు పారిశ్రామిక, మైనింగ్ కేంద్రాలుగా ఉండటంతో కొత్త రైల్వే లైన్ ద్వారా సిమెంట్ ప్లాంట్లు, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ బొగ్గు గనులు, సున్నపురాయి గనులకు మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి రానుంది. దీంతో ప్రయాణ దూరం, సమయం, రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు ఇప్పటికే రద్దీగా ఉన్న వార్ధా–మాణిక్‌గఢ్ మార్గంపై భారం తగ్గనుంది.
సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం, కొత్త మార్గం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజూ రెండు వైపులా రెండు మెము రైళ్లు నడపడంతో పాటు ఏడాదికి 6.08 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగే అవకాశం ఉంది. బొగ్గు, కోక్, సిమెంట్, స్పాంజ్ ఐరన్, తుక్కు ఇనుము, ఉక్కు, ఎరువులు, ఆహారధాన్యాలు ప్రధానంగా రవాణా కానున్నాయి. ఈ లైన్ ద్వారా మాజ్రి–నాందేడ్ మార్గానికి ప్రత్యక్ష అనుసంధానం ఏర్పడి జాల్నా, పర్భాని, ఛత్రపతి శంభాజీనగర్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు సరుకు రవాణా సులభతరం కానుంది. అలాగే బల్హార్షా–నాగ్‌పూర్ హై-డెన్సిటీ మార్గంపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు యవత్మాల్, చంద్రాపూర్ ప్రాంతాల్లో రైల్వే మౌలిక సదుపాయాలు మెరుగుపడి పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి ఊతం లభించనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!