

అమరావతిని సందర్శించి అక్కడి అపార అవకాశాలను వినియోగించుకోవాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సింగపూర్‌లో నిర్వహించిన వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో ‘కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్’ అనే అంశంపై జరిగిన లీడర్‌షిప్ ప్లీనరీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. 25 ఏళ్ల క్రితమే సమాచార సాంకేతికత ప్రాధాన్యాన్ని గుర్తించి మాట్లాడిన విషయాన్ని గుర్తుచేసిన చంద్రబాబు, ఇప్పుడు కృత్రిమ మేధస్సు యుగం ప్రారంభమైందన్నారు. పీపుల్ ఫస్ట్ విధానంతో సమానత్వం, ప్రకృతి పరిరక్షణ, అవకాశాలు, జీవన నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక సదుపాయాలతో ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం వివరించారు. కృష్ణానది తీరంలో 21 కిలోమీటర్ల వాటర్‌ఫ్రంట్, ఐకానిక్ బ్రిడ్జిలు, ఇన్నర్-ఔటర్ రింగ్ రోడ్లు, సైక్లింగ్ ట్రాక్‌లు, వాకింగ్ మార్గాలు, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, గ్రీన్ ఎనర్జీ, అండర్‌గ్రౌండ్ యుటిలిటీలతో నగరం అభివృద్ధి చెందుతోందన్నారు. స్పోర్ట్స్, ఫైనాన్స్, నాలెడ్జ్, జస్టిస్, టూరిజం, హెల్త్, మీడియా రంగాలకు కేంద్రంగా అమరావతిని రూపొందిస్తున్నామని చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని పేర్కొంటూ, ప్రపంచంలోనే అత్యుత్తమ నాలెడ్జ్ సిటీలలో ఒకటిగా అమరావతి అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!