

మురసు తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల్లో అధికార యంత్రాంగం సన్నద్ధత, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించారు. తెల్లవారుజామున ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. తీరం దాటే సమయంలో గంటకు 100–110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు కొత్తపట్నం పరిసర ప్రాంతాల్లో వర్షాలు, గాలుల తీవ్రతపై చంద్రబాబు ఆరా తీశారు. నెల్లూరులో చిరుజల్లులు, ఒంగోలులో మోస్తరు వర్షం కురుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు తీరం దాటే వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించాలని సీఎం ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆస్తి నష్టం తగ్గించేందుకు, కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల సిబ్బంది ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలకు సమాచారం చేరవేయాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు కూలినా, సరఫరాకు అంతరాయం కలిగినా పునరుద్ధరణ పనులను వేగంగా చేపట్టేందుకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్నబ్ తుఫాన్ సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రేపు వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 263 మి.మీ., గుంటూరులో 242 మి.మీ., బాపట్లలో 146 మి.మీ., పల్నాడులో 143 మి.మీ. సగటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. కృష్ణా, ప్రకాశం, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మొత్తంగా 125 మండలాల్లో భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!