

భారత సరిహద్దులకు సమీపంలో చైనా తన అత్యాధునిక జే-20 ‘మైటీ డ్రాగన్’ స్టెల్త్ యుద్ధవిమానాలను మోహరించినట్లు శాటిలైట్ చిత్రాలు వెల్లడించాయి. రాడార్లకు చిక్కకుండా ప్రయాణించగల సామర్థ్యం ఉన్న ఈ ఫైటర్ జెట్లు చైనా వైమానిక దళంలోని అత్యంత శక్తిమంతమైన యుద్ధవిమానాల్లో ఒకటిగా భావిస్తారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) సమీపంలోని జింజియాంగ్, టిబెట్ ప్రాంతాల్లోని వైమానిక స్థావరాల్లో మొత్తం 12 జే-20 విమానాలను మోహరించినట్లు వాణిజ్య శాటిలైట్ సంస్థ వాంటోర్ చిత్రాల ద్వారా తెలుస్తోంది.
జూలై 9న తీసిన శాటిలైట్ చిత్రాల ప్రకారం, జింజియాంగ్ ప్రావిన్స్‌లోని హోటన్ ఎయిర్‌బేస్‌లో 8 జే-20 యుద్ధవిమానాలు కనిపించాయి. ఈ స్థావరం లడఖ్‌లోని లేహ్‌కు సుమారు 389 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే టిబెట్‌లోని డామ్‌జంగ్ వైమానిక స్థావరంలో మరో 4 జే-20 విమానాలను గుర్తించారు. ఈ స్థావరం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌కు సుమారు 344 కిలోమీటర్ల దూరంలో ఉంది. తక్కువ వ్యవధిలో ఎత్తయిన ప్రాంతాల్లో ఇన్ని అత్యాధునిక యుద్ధవిమానాల మోహరింపు రక్షణ వర్గాల్లో చర్చకు దారితీసింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!