

అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన అమానుష దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గదిలోనే బాలికపై రంపంతో దాడి చేయడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి, ఆమెకు అందుతున్న వైద్య చికిత్స వివరాలను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. నిందితుడిని పట్టుకుని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ ఘటనపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కూడా తీవ్రంగా స్పందించారు. తరగతి గదిలో రక్తపు మడుగులో ఉన్న చిన్నారిని చూసిన తర్వాత తనకు కన్నీళ్లు ఆగడం లేదని, గుండె బరువెక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలు, మహిళలపై దాడులకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించే వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం మరోసారి చర్చకు వచ్చింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!