

ట్రాఫిక్ రద్దీ నుంచి తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు ఫుట్‌పాత్‌లపై ద్విచక్ర వాహనాలతో పాటు ఇతర వాహనాలను నడుపుతున్నారు. దీనివల్ల పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ ఉల్లంఘనలను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం జరిమానాలను భారీగా పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఫుట్‌పాత్‌లపై వాహనాలు నడిపితే విధిస్తున్న రూ.500 జరిమానాను మొదటిసారి పట్టుబడిన వారికి రూ.5,000కు పెంచాలని ప్రతిపాదించింది. అదే తప్పును రెండోసారి చేస్తే రూ.10,000 జరిమానా విధించే అవకాశం ఉంది.
ఈ మేరకు రవాణా, హోం శాఖలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. చట్టపరమైన అంశాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే జరిమానాల పెంపునకు ఇంకా అధికారిక ఆమోదం లభించలేదు. కొత్త నిబంధనలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ వెలువడే వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.500 జరిమానానే కొనసాగుతుంది. పాదచారుల భద్రతను కాపాడటం, ఫుట్‌పాత్‌లపై వాహనాల రాకపోకలను అరికట్టడం ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!