

తన కుమార్తె అంజిలి రెడ్డి వివాహ వేదికకు సంబంధించి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. యలహంకలోని ప్రాపర్టీ గతంలో ఉమ్మడి ఆస్తిగా ఉండేదని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఆస్తుల పంపకాల్లో అది పూర్తిగా తనకు, తన పిల్లలకు దక్కిందని షర్మిల స్పష్టం చేశారు. ఈ విషయం దేవుడి సాక్షిగా నిజమని పేర్కొన్నారు. ఆ ఇల్లు తన పిల్లల హక్కు అని, తన తండ్రి వైఎస్సార్ కూడా అక్కడ నివసించిన నేపథ్యంలో, కుమార్తె అంజిలి కోరిక మేరకు అదే ఇంట్లో వివాహం జరపాలని మొదట భావించినట్లు తెలిపారు. అయితే తాను పెరిగిన ఇంట్లోనే పెళ్లి చేసుకోవాలన్న కుమార్తె ఆకాంక్షను నెరవేర్చలేకపోయామని బాధ వ్యక్తం చేశారు.
వివాహ వేదిక విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందిస్తూ, అంజిలి గురించి ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికీ షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. పెద్దలు కుదిర్చిన సంబంధమైన వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహాన్ని ఎలాంటి వివాదాలు, గొడవలు లేకుండా నిర్వహించాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. అందుకే యలహంక ఇంట్లో కాకుండా మరో ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో వివాహ వేడుక నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. కాబోయే దంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆమె ఆకాంక్షించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!