

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి పరిస్థితులను పరిశీలించారు. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలు కృష్ణా నదికి చేరుతున్న దృశ్యాలను ఆయన పరిశీలించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం ముగించుకుని తిరుగు ప్రయాణంలో భాగంగా బ్యారేజ్ వద్ద కొద్దిసేపు ఆగి పరిస్థితిని సమీక్షించారు. గోదావరి నీటితో నిండి ఉన్న బ్యారేజ్ ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తోందని సీఎం అన్నారు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 17.52 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ప్రవాహాలు రావడంతో 521 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్లు వివరించారు. డెల్టా పంటలకు సాగునీటి సరఫరా కోసం తూర్పు కాలువకు 3,928 క్యూసెక్కులు, పశ్చిమ కాలువకు 3,115 క్యూసెక్కులు, గుంటూరు ఛానల్‌కు 115 క్యూసెక్కులు కలిపి మొత్తం 7,158 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల్లో సమర్థ నీటి నిర్వహణ ద్వారా రైతులకు ఉపశమనం కల్పిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!