

అరెస్టులు, నిర్బంధాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే అతడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చేందుకు రాజ్యాంగం నిర్దేశించిన 24 గంటల గడువు ప్రారంభమవుతుందని తేల్చిచెప్పింది. అధికారికంగా అరెస్టు చేసిన సమయం నుంచి కాకుండా, అదుపులోకి తీసుకున్న సమయం నుంచే ఈ గడువును లెక్కించాలని స్పష్టం చేసింది. నిర్బంధానికి, అధికారిక అరెస్టుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఉపయోగించుకుని న్యాయపరమైన విచారణను ఆలస్యం చేయడానికి అధికారులకు అనుమతి లేదని పేర్కొంది. కోర్టు ముందు హాజరుపరిచే సమయంలో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తేదీ, సమయాన్ని మేజిస్ట్రేట్లు తప్పనిసరిగా నమోదు చేయాలని, 24 గంటల నిబంధన పాటించారా లేదా పరిశీలించాలని ఆదేశించింది.
గతంలో ఒడిశా, మద్రాస్, కేరళం హైకోర్టులు ఇచ్చిన అభిప్రాయాలను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అధికారిక అరెస్టుకు ముందు నిర్బంధంలో ఉన్న సమయాన్ని 24 గంటల గడువు లెక్కింపులో మినహాయించవచ్చన్న అభిప్రాయంతో ఏకీభవించలేదు. అరెస్టు చేసిన ప్రదేశం నుంచి న్యాయస్థానానికి చేరుకోవడానికి పట్టే ప్రయాణ సమయాన్ని మినహాయిస్తే, ఇతర మినహాయింపులకు అవకాశం లేదని స్పష్టం చేసింది. సుజిత్ దాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. త్రిపురలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో నిందితుడైన సుజిత్ దాస్‌ను గతేడాది సెప్టెంబర్ 29న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మరుసటి రోజు ఉదయం అధికారికంగా అరెస్టు చేసినట్లు నమోదు చేసి, అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అరెస్టు సమయాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా నమోదు చేశారని నిందితుడి న్యాయవాదులు వాదించగా, అధికారిక అరెస్టు సమయం నుంచే 24 గంటల గడువు లెక్కించాలన్న దర్యాప్తు సంస్థల వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!