

సంస్థల్లో ఏఐ ఏజెంట్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వాటి వల్ల తలెత్తే భద్రతా ముప్పులను ఎదుర్కొనేందుకు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అదుపు తప్పి లేదా నిర్దేశించిన విధులకు విరుద్ధంగా పనిచేసే ఏఐ ఏజెంట్లను తక్షణమే నిలిపివేసేందుకు ‘కిల్ స్విచ్’ను అందుబాటులోకి తెచ్చింది. నవంబర్ 3న యూరప్‌లో నిర్వహించిన సంస్థ ఫాల్‌కాన్ సమావేశంలో దీనిని ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా భద్రతా బృందాలు తప్పుగా వ్యవహరించే ఏఐ ఏజెంట్లను నిలిపివేయడంతో పాటు, అవి మళ్లీ ప్రారంభం కాకుండా అడ్డుకోవచ్చు. వాటి నెట్‌వర్క్ యాక్సెస్‌ను కూడా నిలిపివేయవచ్చు. సంస్థల్లో పనిచేసే ఏఐ ఏజెంట్లను పర్యవేక్షించే ఫాల్కన్ గార్డియన్ ప్లాట్‌ఫామ్‌లో భాగంగా ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్ వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంది.
క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ మాట్లాడుతూ.. ఏఐ అభివృద్ధిని నెమ్మదించినంత మాత్రాన ఇప్పటికే ఉన్న భద్రతా ముప్పులు తొలగిపోవని, వాటిని ఎదుర్కొనేందుకు సమర్థమైన రక్షణ వ్యవస్థలు అవసరమని పేర్కొన్నారు. ఏఐ ఏజెంట్లు నిర్దేశించిన పరిమితులు దాటి వ్యవహరిస్తే వాటిని నిలిపివేయగలమని తెలిపారు. మరోవైపు ఎన్విడియా, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా ఏఐ వ్యవస్థల పర్యవేక్షణ, భద్రతను మెరుగుపరిచే పరిష్కారాలపై దృష్టి సారిస్తున్నాయి. అధునాతన ఏఐ వ్యవస్థలపై మానవ నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకోవాలనే చర్చ ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుంటోంది. కాలిఫోర్నియా ప్రభుత్వం కూడా ప్రమాదకరంగా మారే ఏఐ వ్యవస్థలను నిలిపివేసే అత్యవసర విధానాలపై అధ్యయనం చేయాలని నిపుణుల బృందాన్ని ఆదేశించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!