

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఖర్చులను నియంత్రించేందుకు గూగుల్ తన ఉద్యోగుల వాలంటరీ ఎగ్జిట్ పథకాన్ని ఐదు దేశాలకు విస్తరించింది. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్‌లోని కొందరు ఉద్యోగులకు ఈ ఏడాది జూన్ నుంచి స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలను అందిస్తున్నట్లు సంస్థ రాయిటర్స్‌కు వెల్లడించింది. గతేడాది నుంచి అమెరికా, బ్రిటన్‌లోని కొన్ని విభాగాల్లోనూ ఇలాంటి పథకాలను అమలు చేస్తోంది. భవిష్యత్తులో సంస్థ ప్రాధాన్యమిచ్చే రంగాలకు వనరులను మళ్లించడం, ముఖ్యంగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాలను బలోపేతం చేయడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
స్విట్జర్లాండ్‌లో సుమారు 5,000 మంది ఉద్యోగులున్న గూగుల్.. జ్యూరిచ్‌లో కీలక ఇంజినీరింగ్ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. అక్కడ పలు విభాగాలకు ఈ పథకం వర్తించినప్పటికీ, డీప్‌మైండ్ విభాగాన్ని మినహాయించినట్లు సమాచారం. ఈ ఆఫర్లను అంగీకరించిన ఉద్యోగులు ఆగస్టు నుంచి సంస్థను వీడటం ప్రారంభించారు. దరఖాస్తు చేసుకున్నవారికి జులై మధ్య నాటికి సమాధానాలు ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పథకాన్ని అంగీకరించిన అర్హులైన ఉద్యోగులకు ప్రతి సర్వీస్ సంవత్సరానికి ఒక నెల జీతం చొప్పున, గరిష్ఠంగా 12 నెలల జీతాన్ని అందించినట్లు వెల్లడించాయి. సుమారు 50 మంది పనిచేసే ఒక బృందంలో కనీసం నలుగురు ఈ ఆఫర్‌ను అంగీకరించినట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!