

తెలంగాణలో చేయూత సామాజిక భద్రత పెన్షన్ పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్లు మంజూరు చేసేందుకు క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నప్పటికీ, పెన్షన్ల మంజూరులో జాప్యం లేకుండా పరిశీలనను సమాంతరంగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. తొలి దశలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో మండల స్థాయి అధికారులు, మున్సిపాలిటీల్లో సంబంధిత అధికారులు, కార్పొరేషన్ పరిధిలో సర్కిల్ స్థాయి అధికారులు ఈ ప్రక్రియలో పాల్గొంటారు.
వెరిఫికేషన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన చేయూత మొబైల్ యాప్‌లో దరఖాస్తుదారుల వివరాలు, పత్రాలు, అర్హత ప్రమాణాలను అధికారులు నమోదు చేయనున్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితి, నివాస స్థితి, పెన్షన్ కేటగిరీ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అవసరమైన పత్రాలు సమర్పించని దరఖాస్తుదారుల నుంచి సంబంధిత ధ్రువపత్రాలను సేకరించి యాప్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. ఈ నెల 25లోగా వెరిఫికేషన్ పూర్తి చేసి అర్హుల జాబితాను జిల్లా స్థాయికి పంపిస్తారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆమోదంతో కొత్త చేయూత పెన్షన్లకు మంజూరు ఉత్తర్వులు జారీ చేయనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!