

తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. కొందరు మోసగాళ్లు టీటీడీ పేరు, లోగో, చిత్రాలను ఉపయోగించి భక్తులను ఆకర్షిస్తూ, బుకింగ్‌లు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపింది. దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌లను అధికారిక టీటీడీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే చేసుకోవాలని స్పష్టం చేసింది.
నకిలీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై టీటీడీ ఐటీ, విజిలెన్స్, సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి ప్రత్యేక నిఘా కొనసాగిస్తోంది. గత రెండేళ్లలో 259 నకిలీ వెబ్‌సైట్లను గుర్తించి తొలగించడంతో పాటు, వాటికి సంబంధించిన పలువురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపింది. వాట్సాప్‌లో వచ్చే అనధికారిక లింకులను నమ్మకూడదని, తెలియని వ్యక్తులకు బుకింగ్ పేరుతో డబ్బులు పంపవద్దని భక్తులకు సూచించింది. టీటీడీ పేరు, లోగోను ఉపయోగించే వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు అధికారికమైనవో కాదో నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలని కోరింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!