

ఫిలిప్పీన్స్‌లోని పర్యాటక ప్రాంతం పలవాన్‌కు వెళ్తున్న ఓ ఫెర్రీ బుధవారం రాత్రి సముద్రంలో అగ్నిప్రమాదానికి గురైంది. కోరాన్ సమీప జలాల్లో జరిగిన ఈ ప్రమాద సమయంలో MV జూన్ ఆస్టర్ అనే పడవలో మొత్తం 137 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 117 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తుండగా, మరో 87 మంది ఆచూకీ గల్లంతైంది. 42 మందిని రక్షించినట్లు ఫిలిప్పీన్స్ కోస్ట్‌గార్డ్ తెలిపింది. బుధవారం రాత్రి 11.02 గంటల సమయానికి 42 మందిని రక్షించినట్లు కోస్ట్‌గార్డ్ ప్రతినిధి వెల్లడించారు. మృతదేహాలను కోరాన్‌కు తరలించినట్లు తెలిపారు. సముద్ర తీరానికి సుమారు 1.2 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
7,000కు పైగా ద్వీపాలతో కూడిన ఫిలిప్పీన్స్‌లో సముద్ర రవాణా అత్యంత సాధారణమైనది. విమాన మార్గం అందుబాటులో లేని ద్వీపాల మధ్య ప్రయాణికులు, సరకు రవాణాకు ఫెర్రీలు చవకైన రవాణా మార్గంగా ఉన్నాయి. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, రుతుపవన వర్షాలు, తుపానుల కారణంగా సముద్ర ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, బలమైన అలల కారణంగా ఫెర్రీ ప్రమాద ప్రాంతం నుంచి సుమారు 7.6 నాటికల్ మైళ్ల దూరం కొట్టుకుపోయిందని కోస్ట్‌గార్డ్ అధికారులు తెలిపారు. గతంలోనూ సరైన నిర్వహణ లేకపోవడం, భద్రతా నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ఘటన ఆందోళనకు దారితీసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!