

ఐఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఫోన్ల విభాగంలోకి అడుగుపెట్టింది. కాలిఫోర్నియాలోని కుపర్టినోలో ఉన్న యాపిల్ పార్క్‌లో ‘సర్‌ప్రైజ్ అండ్ షైన్’ పేరుతో బుధవారం నిర్వహించిన వార్షిక కార్యక్రమంలో ‘ఐఫోన్ డువో’ను కంపెనీ ఆవిష్కరించింది. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత యాపిల్ విడుదల చేసిన తొలి ఉత్పత్తి ఇదే. ఏ20 ప్రో ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 12 మెగాపిక్సెల్ ముందు కెమెరాతో ఈ ఫోన్ రూపొందింది. రెండు తెరలకు విడివిడిగా బ్యాటరీలను అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్ కేవలం ఈ-సిమ్ సదుపాయంతోనే లభించనుంది. మడత పెట్టినప్పుడు 5.4 అంగుళాలు, తెరిచినప్పుడు 7.6 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఉంటుంది. 256 జీబీ మెమొరీతో ప్రారంభమయ్యే ఐఫోన్ డువో ధర 1,999 డాలర్లు. యాపిల్ చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన ఐఫోన్‌గా నిలిచింది. స్టార్ వైట్, నైట్ స్కై రంగుల్లో లభించే ఈ ఫోన్ ఈ నెల 23న భారత్‌తో పాటు ప్రపంచ మార్కెట్లలోకి రానుంది.
ఫోల్డబుల్ ఫోన్‌తో పాటు ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లను కూడా యాపిల్ ఆవిష్కరించింది. ఐఓఎస్ 27 ఆపరేటింగ్ సిస్టమ్, ఏ20 ప్రో ప్రాసెసర్, మెరుగైన బ్యాటరీ, అధిక హార్డ్‌వేర్ పనితీరు, 48 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లను వీటిలో అందించింది. డీప్ బ్లాక్, సిల్వర్, గ్లేసియర్ బ్లూ, బర్గండీ రంగుల్లో 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ, 2 టీబీ మెమొరీ సామర్థ్యాలతో ఇవి లభించనున్నాయి. ఈ నెల 12 నుంచి బుకింగ్‌లు ప్రారంభమై, 18 నుంచి మార్కెట్లోకి రానున్నాయి. మరోవైపు మెరుగైన ఆరోగ్య, ఫిట్‌నెస్ ఫీచర్లతో యాపిల్ వాచ్ సిరీస్ 12, వాచ్ అల్ట్రాను కూడా కంపెనీ ఆవిష్కరించింది. వీటి బుకింగ్‌లు బుధవారం నుంచే ప్రారంభమవుతాయి. అలాగే ఆధునిక నాయిస్ క్యాన్సలేషన్ సదుపాయంతో ఎయిర్‌పాడ్స్ 5ను కూడా లాంచ్ చేసింది. ఇది కూడా ఈ నెల 18 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!