

భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ తదుపరి దశలోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పటికే అవసరమైన స్థాయి, విస్తృతి, ప్రజలందరికీ అందుబాటు వంటి అంశాలను సాధించామని పేర్కొన్నారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (GFF) 2026లో ప్రసంగించిన మోదీ.. గత పదేళ్లలో ఫిన్‌టెక్ రంగం సాధించిన పురోగతిని వివరించారు. కోట్లాది మందిని అధికారిక డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో UPI కీలక పాత్ర పోషించిందన్నారు. ఇక తదుపరి దశలో UPIని మరిన్ని దేశాలకు విస్తరించడంతో పాటు ఇతర దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆధార్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, UPI వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థలు డిజిటల్ గుర్తింపు, తక్షణ చెల్లింపులు, సమ్మతి ఆధారిత డేటా షేరింగ్‌ను భారీ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంలో కీలకంగా నిలిచాయని చెప్పారు.
భారత్ ఫిన్‌టెక్ రంగం తదుపరి దశ కేవలం డిజిటల్ చెల్లింపులకే పరిమితం కాకూడదని మోదీ అన్నారు. రుణాలు, పొదుపులు, పెన్షన్లు, బీమా వంటి రంగాల్లో టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచాలని సూచించారు. వీధి వ్యాపారులను అధికారిక రుణ వ్యవస్థలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో PM SVANidhi క్రెడిట్ కార్డు పథకాన్ని 2030 వరకు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏజెంటిక్ AI, క్వాంటమ్ కంప్యూటింగ్, టోకెనైజేషన్ వంటి సాంకేతికతలు భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలో కొత్త అవకాశాలను సృష్టించగలవని అన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీకి అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు విశ్వాసం, భద్రత, సమర్థవంతమైన నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!