

హైడ్రా కబ్జాల తొలగింపు చర్యలతో హైదరాబాద్ మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు కొత్త రూపు సంతరించుకుంది. చెరువు పరిసరాల్లోని ఆక్రమణలను తొలగించిన అనంతరం అధికారులు సుమారు రూ.20 కోట్లతో సుందరీకరణ పనులు పూర్తి చేశారు. ఇందులో భాగంగా చెరువు చుట్టూ 1.2 కిలోమీటర్ల పొడవున వాకింగ్ ట్రాక్ నిర్మించారు. ట్రాక్‌కు ఇరువైపులా మొక్కలు నాటి, ల్యాండ్‌స్కేపింగ్ పనులు చేపట్టారు. దీంతో చెరువు పరిసరాలు పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారాయి. స్థానికులు ఉదయం, సాయంత్రం వేళల్లో నడకకు వెళ్లేందుకు అనువైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి పనులు చేపట్టారు.
సందర్శకుల సౌకర్యార్థం చెరువు పరిసరాల్లో బెంచీలు, యోగా వేదిక, రోజ్ గార్డెన్ వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పచ్చదనం, వాకింగ్ ట్రాక్‌తో పాటు విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ అభివృద్ధి పనులతో తమ్మిడికుంట చెరువు స్థానికులకు ఆహ్లాదకరమైన విహార ప్రదేశంగా మారనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఈ సుందరీకరణ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుతో చెరువు పరిసరాలు మరింత ఆకర్షణీయంగా మారడంతో పాటు ప్రజలకు వ్యాయామం, విశ్రాంతి కోసం అదనపు సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!