

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన రైతుల పంట రుణాలను ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం పునర్వ్యవస్థీకరించి, రీషెడ్యూల్ చేయడంతో పాటు రబీ సీజన్‌కు కొత్త రుణాలను సకాలంలో అందించాలని సూచించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో 365 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించామని, వీటిలో 111 మండలాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని, తక్కువ నీటితో సాగయ్యే పంటలు, సూక్ష్మ సేద్యం, పంటల మార్పిడి, నిల్వ, ప్రాసెసింగ్ రంగాలకు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. వ్యవసాయంపై మాత్రమే ఆధారపడకుండా రైతు కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కల్పించేందుకు బ్యాంకులు సహకరించాలని పేర్కొన్నారు.
విద్యా, వ్యక్తిగత గృహ నిర్మాణం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), మౌలిక సదుపాయాల రంగాలకు రుణాల మంజూరును పెంచాలని భట్టి విక్రమార్క బ్యాంకులకు సూచించారు. మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రైతాంగాన్ని ఆదుకునేందుకు బ్యాంకర్లు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు. రబీ సీజన్‌కు నిర్దేశించిన రూ.38,268 కోట్ల పంట రుణాలను వెంటనే మంజూరు చేయాలని సూచించారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటల సాగుతో పాటు డ్రిప్, స్ప్రింక్లర్ సేద్యానికి రుణాలు అందించాలని తెలిపారు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, పశుపోషణ, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ రంగాలను ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించవచ్చన్నారు. రైతులకు రుణాల పునర్వ్యవస్థీకరణ, కొత్త పంట రుణాల మంజూరులో జాప్యం చేయకుండా ప్రభుత్వం, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!