

దీపావళి పండుగ ముగిసినప్పటికీ ప్రధాన నగరాల మధ్య రైళ్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ఈ రద్దీని తగ్గించేందుకు దక్షిణ కోస్తా రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య రెండు, సికింద్రాబాద్–తిరుపతి మార్గంలో మరో రెండు రైళ్లు నడపనున్నారు. నవంబర్ 15, 16 తేదీల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. రైళ్ల సమయాలు, స్టాపులు, కోచ్‌ల వివరాలను అధికారులు వెల్లడించారు.
రైలు నంబర్ 08517 నవంబర్ 15న మధ్యాహ్నం 3:50 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 16న రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:05 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఈ రైళ్లకు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, భీమడోలు టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లిలో స్టాపులు ఉన్నాయి. ఒక్కో రైలులో రెండు సెకండ్ ఏసీ, నాలుగు థర్డ్ ఏసీ, ఏడు స్లీపర్, నాలుగు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఇక తిరుపతి నుంచి రైలు నంబర్ 07421 నవంబర్ 15న సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07422 నవంబర్ 16న సాయంత్రం 4:15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు తిరుపతి చేరుతుంది. ఈ రైళ్లకు రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూరు, కృష్ణ, యాద్గిర్, సెరాం, తాండూరు, వికారాబాద్, హైటెక్ సిటీ, బేగంపేటలో స్టాపులు ఉన్నాయి. ఒక్కో రైలులో రెండు సెకండ్ ఏసీ, ఆరు థర్డ్ ఏసీ, ఎనిమిది స్లీపర్, నాలుగు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!