

ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు ఆధ్యాత్మికంగానూ ముందుకు సాగుతోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. కాణిపాకం నుంచే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఊపునిస్తున్నామని పేర్కొన్నారు. కాణిపాకంలో జరుగుతున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఏపీ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్రంలోని ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య గతంతో పోలిస్తే 35 నుంచి 40 శాతం పెరిగిందని తెలిపారు. మెరుగైన వసతులు, పారిశుధ్యం, భద్రతా ఏర్పాట్లు కల్పించడం వల్లే భక్తుల సంఖ్య పెరిగిందని వివరించారు.
రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి దేవదాయ శాఖ ఆధ్వర్యంలో భారీగా నిధులు కేటాయిస్తున్నామని మంత్రి ఆనం తెలిపారు. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో కొత్త ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని, నిత్య నైవేద్యాలు, అన్నదాన కార్యక్రమాలను మరింత విస్తరిస్తున్నామని చెప్పారు. తిరుమలతో పాటు కాణిపాకం వంటి ప్రముఖ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రానున్న గోదావరి, కృష్ణా పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబాలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!