

తెలంగాణ పౌర సరఫరాల శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌ను మరింత బలోపేతం చేసేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన 28 మంది కమాండోలను ప్రత్యేకంగా నియమించారు. సివిల్ సప్లైస్ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర, సివిల్ సప్లైస్ భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి కొత్తగా విధుల్లో చేరిన కమాండోలకు దిశానిర్దేశం చేశారు. శాఖ నియమ నిబంధనలు, నిత్యావసర వస్తువులకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. గత సీజన్‌లో రికార్డు స్థాయిలో 154 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించామని, రైతుల నుంచి కొనుగోళ్ల కోసం ప్రభుత్వం సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు.
కొత్తగా నియమితులైన కమాండోలు ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ విభాగం కింద ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలుగా పనిచేయనున్నారు. ప్రభుత్వానికి బియ్యం బకాయిలు చెల్లించని మిల్లర్ల వద్ద రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతోపాటు, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించనున్నారు. ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించడం, నిబంధనలు ఉల్లంఘించడం వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని కమిషనర్ హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన మిల్లర్లపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!