

కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో హరిహర్ ప్రాంతంలో తుంగభద్రా నది తీరాన హరిహరీశ్వర ఆలయం వెలసి ఉంది. ఒకే శిలలో శివుడు, విష్ణువు కలిసి దర్శనమివ్వడం ఈ క్షేత్రానికి ప్రధాన ప్రత్యేకతగా చెప్పబడుతుంది. ఆలయ స్థలపురాణం ప్రకారం గుహాసురుడు అనే రాక్షసుడు శివుడు, విష్ణువు చేతిలో మరణం లేకుండా బ్రహ్మదేవుడి నుంచి వరం పొందాడని చెబుతారు. ఆ వరగర్వంతో దేవతలు, ఋషులు, మునులు, ప్రజలను ఇబ్బందులకు గురిచేయడంతో శివుడు, విష్ణువు కలిసి హరిహర రూపంలో అవతరించి గుహాసురుడిని సంహరించినట్లు సంప్రదాయ కథనం. అనంతరం ఆ దివ్యరూపం శిలగా మారి ఈ క్షేత్రంలో స్వయంభువుగా వెలసిందని విశ్వాసం.
ఆలయంలోని గర్భగుడిలో ఒకే శిలపై కుడివైపు శివుడు, ఎడమవైపు విష్ణువు దర్శనమిస్తారు. శివుడి వైపు త్రిశూలం, విష్ణువు వైపు శంఖం కనిపించడం ఈ రూపాన్ని ప్రత్యేకంగా గుర్తించే అంశాలుగా భక్తులు పేర్కొంటారు. ఆలయ నిర్మాణంలో హొయసల రాజు రెండవ నరసింహుడి కాలానికి చెందిన పొలవాల అనే మంత్రి పాత్ర ఉందని ఆలయ శాసనాల ఆధారంగా చెబుతారు. అనంతరం ఇతర రాజులు కూడా ఆలయ అభివృద్ధికి సహకరించినట్లు చారిత్రక సమాచారం ఉంది. పార్వతి దేవికి ప్రత్యేక ఆలయం కూడా ఉంది. శైవ, వైష్ణవ సంప్రదాయాలను అనుసరించే ఈ క్షేత్రంలో కార్తిక మాసంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, దీపోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా కూడా వ్యవహరిస్తారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!